ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి ఆర్థిక సాయం..
రేపట్నుంచి రూ.2 వేలు జమ
ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రభుత్వమందించే ‘ఆపత్కాలపు ఆసరా’ రేపట్నుంచి అమలు కానుంది. మొత్తం 1,18,004 మందికి సాయం అందిచేందుకు ఎంపిక చేశారు. ఇందులో 1,06,383 మంది టీచర్లు, 11,621 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు.
ఆర్టీజీఎస్ ద్వారా జమ
ఎంపికైన వారికి రేపట్నుంచి రూ.2వేల వారి అకౌంట్లలో ఆర్టీజీఎస్ ద్వారా జమ చేయనుండగా.. ఎల్లుండి నుంచి 25 కేజీల బియ్యం పంపిణీ చేయనున్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి నెలకు రూ.2వేల నగదు, 25 కిలోల బియ్యం అందజేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
రూ.32 కోట్లు మంజూరు
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించిన విద్యాశాఖ.. జిల్లాల వారీగా జాబితాను విద్యాశాఖ డైరెక్టరేట్‌కు పంపించారు. అదే జాబితాను ఆర్థికశాఖకు పంపించనున్నారు. నగదు సాయం కోసం ఇప్పటికే విద్యాశాఖ రూ.32 కోట్లు మంజూరు చేయగా, పౌరసరఫరాల శాఖ 3.625 టన్నుల సన్న బియ్యాన్ని సిద్ధం చేసింది.
ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలన చేపట్టిన అధికారులు.. మొత్తం 2,06,345 దరఖాస్తులను వడబోశారు. 33 జిల్లాలకు సంబంధించి లబ్ధిదారులను ఎంపికచేశారు. వీరి జాబితాను https:/schooledu.telangana.gov.in లో ఉంచారు. లాగిన్‌ఐడీ, పాస్‌వర్డ్ ల ఆధారంగా చూసే వీలుంది.. లేదా డీఈవో ఆఫీసులు, ఆయా పాఠశాలల్లో లబ్ధిదారుల జాబితాను చూసుకోవచ్చు.