అధికారులను జైలుకి పంపినంత మాత్రాన ఆక్సిజన్ కొరతకు పరిష్కారం దొరకదు: జస్టిస్ చంద్రచూడ్

 దేశ రాజధానిలో కోవిడ్ రోగులకు మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయకపోవడంపై దిల్లీ హైకోర్ట్ తమకు జారీ చేసిన కోర్టు ధిక్కార నోటీసులపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఆ కేసును జస్టిస్ డి.చంద్రచూడ్ ధర్మాసనం విచారించింది.


కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దిల్లీకి 700 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసే ప్రక్రియ కొనసాగుతోందని, నిన్న కూడా 585 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశామని ఆయన అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు.‘ధిక్కారం కేసు పెట్టి అధికారులను జైళ్లలో పెట్టడం వల్ల ఆక్సిజన్ రాదు. కానీ, దానికోసం మీరు ఏమేం చేయగలరో మాకు చెప్పండి’ అని కోర్టు ఆయన్ను అడిగింది.

‘ఆక్సిజన్ కొరత వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయారనడంలో, ఇది అత్యవసర స్థితి అనడంలో ఎలాంటి వివాదం లేదని, కానీ దానికోసం ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు రూపొందించింద’ని జస్టిస్ షా కూడా అడిగారు.

సమాధానంగా సొలిసిటర్ జనరల్... "మొదట 5 వేల టన్నుల ఆక్సిజన్ అందుబాటులో ఉంది. అందులో పారిశ్రామిక ఆక్సిజన్ కూడా ఉంది. మొదట్లో మెడికల్ ఆక్సిజన్‌కు అంత డిమాండ్ లేదు. దాంతో, మేం పారిశ్రామిక ఆక్సిజన్ వినియోగాన్ని ఆపేశాం. అలా చాలా మందికి సాయం అందింది. కానీ, ఇప్పుడు రాష్ట్రాలకు ఆక్సిజన్ పంపిణీ విషయంలో సమస్య వస్తోంది" అన్నారు.

దిల్లీలో 700 టన్నుల ఆక్సిజన్ సరఫరా కోసం ఈరోజు నుంచి సోమవారం వరకూ ఏమేం ఏర్పాట్లు చేస్తారో మాకు చెప్పాలని జస్టిస్ చంద్రచూడ్ ఎస్జీ తుషార్ మెహతాను అడిగారు.రాష్ట్రాలకు అవసరమైన ఆక్సిజన్ కేటాయించే విషయంలో శాస్త్రీయ దృక్పథం పాటించాలని జస్టిస్ చంద్రచూడ్ ఈ సందర్భంగా అన్నారు. "ఆక్సిజన్ కోసం మీరు రకరకాల చోట్లకు పరుగులు పెడుతున్నారు. అసలు ఆక్సిజన్ అవసరం ఎంతుంది? మీరెంత సరఫరా చేస్తున్నారో వివరించండి" అని చంద్రచూడ్ తుషార్ మెహతాతో అన్నారు.

దిల్లీలో ప్రస్తుతం కోవిడ్ రోగుల కోసం అదనంగా బెడ్స్ కూడా ఏర్పాటు చేస్తుండటంతో ఇక్కడ ఆక్సిజన్ డిమాండ్ ఎంతుందో పరిశీలించాల్సిన అవసరం ఉందని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు.

"సొలిసిటర్ జనరల్ అందించిన వివరాల ప్రకారం దిల్లీకి గరిష్టంగా 700 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందని అర్ధమవుతోంది" అని ఆయన అన్నారు.

ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఇప్పుడున్న పరిస్థితిని అదుపులోకి తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆక్సిజన్ సరఫరాను ఎంతవరకు పెంచగలరో సాయంత్రానికల్లా వివరణ ఇమ్మని జస్టిస్ చంద్రచూడ్ కోరారు.

"ప్రస్తుతానికి ఆక్సిజన్ కోసం దేశంలో పశ్చిమ ప్రాంతం నుంచి ఒకటి, తూర్పు ప్రాంతం నుంచి మరొకటి రెండు సరఫరా వ్యవస్థలు ఉన్నాయి" అని ఎస్‌జీ మెహతా కోర్టుకు సమాధానమిచ్చారు.

ప్రతీ రాష్ట్రానికి దగ్గరలో ఉన్న రాష్ట్రం నుంచి ఆక్సిజన్ సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు మెహతా వివరించారు.

కోవిడ్ బారిన పడి మరణించిన న్యాయవాదుల విషయం ప్రస్తావిస్తూ ఎంతో మంది న్యాయవాదులు ఈ స్థితిపై కన్నీరు కారుస్తున్నారని అన్నారు. "మనం ఈ దేశ పౌరలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది" అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.

రోగులకు ఆసుపత్రుల్లో బెడ్స్ లభించటం లేదనే ఫిర్యాదును ప్రస్తావిస్తూ "మనం ఇక్కడ సమస్యలు పరిష్కరించడానికి ఉన్నాం. ప్రస్తుతానికి ప్రాణాలను ఎలా కాపాడాలో ఆలోచించాలి" అని ఈ కేసును విచారిస్తున్న మరో సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ ఎమ్ఆర్ షా అన్నారు.

"ఇది తప్పులు వెతికే సమయం కాదు. ప్రాణాలను ఎలా కాపాడగలమనే విషయానికే ప్రాధాన్యం ఇవ్వాలి" అని జస్టిస్ షా అన్నారు.

"ఒక వైపు ప్రజలు ఆక్సిజన్ దొరకక మరణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనమేం చేయగలం? కేంద్రం ఏం చేయగలదో చూడాలి. అందరూ ఎవరి స్థాయిలో వారు కష్టపడుతున్నారు" అని జస్టిస్ షా అన్నారు.

అయితే, ఈ మొత్తం కేసులో ఆక్సిజన్ సరఫరా చేసే విధానం, పంపిణీ కోసం చేసే ప్రణాళిక, అందుబాటులో ఉన్న ఆక్సిజన్ ను తెప్పించే విధానం మూడు ముఖ్యమైన అంశాలు" అని చంద్రచూడ్ అన్నారు. "ఇప్పటికే 550 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తెప్పించగలిగాం. కానీ, దాని పై కూడా ఇంకా వివాదం కొనసాగుతోంది" అని ఎస్ జి మెహతా అన్నారు.

"ఇప్పుడు ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉంది". 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఎలా తెప్పిస్తారో కోర్టుకు తెలియచేయమని జస్టిస్ చంద్రచూడ్ ఎస్ జికి ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆక్సిజన్ సరఫరాను పర్యవేక్షించడంలో, దిల్లీతో సహా ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయడంలో విఫలమయ్యారని అంటూ వారి పై దిల్లీ హై కోర్టు జారీ చేసిన కోర్టు ధిక్కార ఆదేశాలకు స్టే జారీ చేసింది.

కేంద్రం దిల్లీకి అవసరమైన 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసేందుకు చేయనున్న ప్రణాళికనుగురువారం ఉదయం కోర్టు సమావేశమయ్యే సమయానికల్లా తెలియచేయమని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారం ఉదయానికి వాయిదా వేసింది.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు