*తప్పు చేసినోళ్లకు చుక్కలుచూపిస్తాం: చంద్రబాబు*


అమరావతి: తెదేపాను ఇబ్బంది పెట్టేవారు భవిష్యత్తులో 10 రెట్లు ఎక్కువ ఇబ్బందిపడక తప్పదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. తప్పుచేసిన వాళ్లకు చుక్కలు చూపిస్తామన్నారు. నాయకులు కేసులకు భయపడొద్దని సూచించిన చంద్రబాబు.. ధైర్యంగా పోరాడే వాళ్లకే భవిష్యత్తులో పదవులని తేల్చిచెప్పారు. జగన్‌ పాలనంతా అబద్ధాల అంకెల పైనే నడుస్తోందని.. వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని మహానాడు వేదికగా శ్రేణులకు బోధించారు. మహానాడులో రెండో రోజు రాష్ట్రంలో వ్యవసాయం, సాగునీరు సహా పలు తీర్మానాలపై చర్చ జరిగింది. రాష్ట్రానికి ఒక కన్ను అయిన అమరావతిని పొడిచేసిన జగన్‌.. రెండో కన్నుగా ఉన్న పోలవరానికీ అదేగతి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. రైతు ప్రభుత్వమని చెప్పుకొంటూ వారి కళ్లకు గంతలు కడుతున్నారని మండిపడ్డారు. 

‘‘సంక్షేమ పథకాల పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారు. గత ప్రభుత్వ పథకాలను కొత్తవిగా చిత్రీకరిస్తున్నారు. ప్రభుత్వానిది మోసకారి సంక్షేమం.. నకిలీ నవరత్నాలు. క్షేత్రస్థాయిలో చర్చలు పెడితే ప్రభుత్వ మోసం తెలిసిపోతుంది. రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియా ఆగడాలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో ఇసుక మొత్తాన్ని ఒకే కంపెనీకి అప్పగించారు. గతేడాది రాష్ట్రంలో మిగులు సౌర విద్యుత్ ఉందన్నారు. 10వేల మెగా వాట్ల సౌర విద్యుత్‌ కోసం టెండర్లు పిలిచారు. ప్రజలపై అదనంగా రూ.2.5లక్షల కోట్ల భారం వేశారు. ధరలు, పన్నులు పెంచారు.. అప్పులు తెచ్చి ఏం చేశారు? ఎక్కడికక్కడ దోచుకొనే కార్యక్రమాలు చేశారు. ప్రజల ముందు ఈ ప్రభుత్వం దోషిగా నిలబడే రోజు త్వరలోనే వస్తుంది’’ అని చంద్రబాబు అన్నారు.

మరోవైపు, సాగు రంగంపై మహానాడులో తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీర్మానం చేశారు. సాగు రంగానికి చేసే ఖర్చుపై ప్రభుత్వానికి స్పష్టతలేదన్నారు. 65లక్షల గాను 45లక్షల రైతు కుటుంబాలకే రైతు భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. అర్హత కలిగిన రైతులకు సున్నా వడ్డీ పథకం ఇవ్వలేదని, ప్రభుత్వ చర్యలతో పంటల దిగుబడి తగ్గిపోయే పరిస్థితి నెలకొంటోందని చెప్పారు. కరోనా, ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం