మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...

 


  • విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం

విశాఖపట్నం:  నగరం అద్దాల మేడలు, ఆకాశాన్నితాకుతున్నట్లు ఉండే భవనాలతో కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయింది. అయితే ఇదే నగరం నడిబొడ్డున ఓ గిరిజన గ్రామం కూడా ఉంది. అది కూడా దట్టమైన అడవి మధ్యలో.

విశాఖ మహానగరంలో ఈ గ్రామం ఉన్నట్లు కూడా చాలా మందికి తెలియదు. అసలు నగరంలో అడవి ఎలా ఉంది? ఆ అడవిలో ఊరు ఎందుకుంది?

గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్‌లోని 98 వార్డులలో 25 లక్షల మంది జనాభా ఉన్నారు. అందులో 350 మంది జనాభాతో శంభువానిపాలెం ఉంది. ఇది ఒక గిరిజన గ్రామం.

మన్నెందొర అనే గిరిజనం ఇక్కడ ఐదు తరాలుగా ఉంటున్నారు. కంబాలకొండ అభయారణ్యం మధ్యలో ఉన్న ఈ గిరిజన గ్రామం... జీవీఎంసీ 6వ వార్డు పరిధిలోకి వస్తుంది.

  • చెక్ పోస్ట్

చెక్ పోస్టు పడతాది...

జీవీఎంసీ విస్తీర్ణం దాదాపు 680 చదరపు కిలోమీటర్లు. ఈ పరిధిలో ఎక్కడికి వెళ్లాలన్నా ఎటువంటి అడ్డుకులు ఉండవు. అయితే శంభువానిపాలెం వెళ్లాలన్నా... వెళ్లిన తరువాత బయటకు రావాలన్నా కూడా చెక్ పోస్టు తనిఖీలు ఎదుర్కోవాల్సిందే.

పీఎం పాలెం నుంచి ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్తే అక్కడొక చెక్ పోస్టు కనిపిస్తుంది. శంభువానిపాలెం వెళ్లేందుకు రెండు కిలోమీటర్ల ముందే అటవీశాఖ చెక్ పోస్టు ఏర్పాటు చేసింది.

గ్రామస్థుల రాకపోకలపై కూడా నిఘా ఉంటుంది. అందుకే ఈ గ్రామానికి అక్కడ నివాసం ఉండేవాళ్లు తప్ప ఇంకెవరు వెళ్లలేరు. దీంతో ఈ గ్రామం ఉన్నట్లు కూడా చాలా మందికి తెలియదు.

విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం

"మా గ్రామం ఎప్పుడు పుట్టిందో మాకు తెలియదు. మేం మన్నెందొర గిరిజనులం. ఐదు తరాలుగా మా తెగ ఇక్కడే ఉంటున్నట్లు మా పెద్దలు చెప్పారు. ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్నవాళ్లంతా ఇక్కడ పుట్టినవాళ్లమే. ఎన్నికల సమయంలో తప్ప, మా గ్రామానికి అధికారులు, రాజకీయ నాయకులు పెద్దగా ఎవరు రారు. అసలు మేం ఇక్కడ ఉంటున్నట్లు చాలా మందికి తెలియదనే అనుకుంటున్నాం’’ అని చెప్పారు శంభువానిపాలేనికి చెందిన సీతారాం.

‘‘మాకు ఏ అవసరమున్నా... దగ్గర్లోని హనుమంతవాక, మధురవాడ, పోతినమల్లయ్యపాలెం వెళ్తుంటాం. మేం గ్రామం బయలకు వెళ్లాలన్నా... తిరిగి లోపలికి రావాలన్ని చెక్ పోస్టులో వివరాలు చెప్పాలి. మా గ్రామానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లు ఎవరూ ఉండరు. అలాగే మా గ్రామంపై నుంచి రాకపోకలు చేసేందుకు కూడా అవకాశం లేదు. అడవిలో ఉన్నాం మేం" అంటూ ఆయన మాట్లాడుతుండగానే, ‘రాముడు’ అని కేక వినిపించింది. ఫోన్ సిగ్నల్ వచ్చినట్లుందంటూ నీటి ట్యాంక్ వైపు పరుగు తీశారు సీతారాం.

  • విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం

బేసిక్ మోడల్ ఫోన్... వాటర్ ట్యాంక్

శంభువానిపాలెంలో జీవీఎంసీ నిర్మించిన ఎత్తైన నీటి ట్యాంక్ ఉంది. ఈ ట్యాంక్ పై ఎప్పుడూ ఇద్దరు, ముగ్గురు కచ్చితంగా కనిపిస్తుంటారు. చేతిలో బేసిక్ మోడల్ ఫోన్ పట్టుకుని...దాని వైపు తదేకంగా చూస్తూ ఉంటారు... ఫోన్ లో సిగ్నల్ కనిపించగానే వారి ముఖంలో ఆనందం కనిపిస్తుంటుంది.

ఎందుకంటే ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నలే ఉండదు. సిగ్నల్ రావాలంటే నీటి ట్యాంక్ ఎక్కాల్సిందే.

"మా ఊర్లో సెల్ ఫోన్ సిగ్నల్ ఉండదు. అడవి మధ్యలో ఉండటం... అటవీశాఖధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో సెల్ టవర్లు వేయలేదు. అయితే మధురవాడ, పీఎం పాలెం, జూ పార్కు పరిసరాల్లో ఉన్న టవర్ల నుంచి వచ్చే సిగ్నలో...ఏమో...బేసిక్ మోడల్ సెల్ ఫోన్లకు అప్పుడప్పుడ సిగ్నల్ వస్తుంది. అది కూడా వాటర్ ట్యాంక్, ఎత్తైన మేడలు ఎక్కితేనే. దాంతో మా ఊర్లో ఫోన్లు మాట్లాడాలి అనుకునేవారంతా ఈ ట్యాంకులు, మేడలపైనే కనిపిస్తారు. ఇప్పుడంతా ఆన్ లైన్ చదువులు వచ్చినా...సెల్ ఫోన్ పని చేయకపోవడంతో మా పిల్లలకు అది కూడా వీలుకావడం లేదు" అని ఫోన్ మాట్లాడేందుకు వాటర్ ట్యాంక్ ఎక్కిన పరశురాం  చెప్పారు.

  • విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం

ఇది మరో ప్రపంచం

శంభువానిపాలెం జీవీఎంసీ 6వ వార్డు పరిధిలోకి వస్తుంది. అక్కడికి వెళ్లాంటే ఫారెస్ట్ సిబ్బంది అనుమతి తప్పనిసరి.

"మా గ్రామం భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇది 7,200 హెక్టార్లున్న కంబాల కొండ అభయారణ్యంలో ఉంది. నగరంలోకి అడవి వచ్చిందా...? అడవే నగరంగా మారిందా...? తెలియదు కానీ... మేం నగరానికి చెందిన గిరిజనుల్లా జీవిస్తున్నాం. కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్‌లోనే సెక్యూరిటీ గార్డులుగా, స్వీపర్‌లుగా మాలో కొందరికి పనులు ఇచ్చారు. మిగతా వారు ఊర్లో మేకలు కాసుకుని జీవనం సాగిస్తుంటారు’’ అని కంబాల కొండలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న శంభువానిపాలెం నివాసి ఒకరు చెప్పారు.

గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్ వాడీ కేంద్రం తప్పితే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఏ భవనమూ లేదు. ఆసుపత్రి లేదు. వైద్యం కోసం ఐదారు కిలోమీటర్లు వెళ్లాల్సిందే. సిగ్నల్ సమస్య కారణంగా రేషన్ కూడా ఊరి బయట సిగ్నల్ ఉన్న చోటుకి వెళ్లి తీసుకుంటాం. మా ఊరు రావడానికి కూడా మా బంధువులు ఇష్టపడరు. వస్తే వారికి ప్రపంచంతో సంబంధాలు కట్ అయిపోతాయి. ఎందుకంటే శంభువానిపాలెం మరో ప్రపంచం" అని ఆయన అన్నారు.

  • విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం

కొండ జమీందార్లు... సేవకులు

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని 11 మండలాల్లో అనేక గిరిజన తెగలున్నాయి. అయితే విశాఖ నగర పరిధిలో గిరిజన తెగలు ఉండటం ఆశ్చర్యంగానే ఉంటుంది.

ఇప్పుడంటే నగరం కానీ...ఒకప్పుడు విశాఖ అంటే 50 శాతం అడవే. కొన్ని తెగల గిరిజనులు వ్యాపారం కోసం లేదా విడిది కోసం కూడా... వారు ఉండే ప్రాంతాలకు దూరంగా వచ్చేవారని ఏయూ చరిత్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ బీబీసీతో చెప్పారు.

"జమీందార్ల కాలంలో మైదాన జమీందార్లు, కొండ జమీందార్లు అని ఉండేవారు. గిరిజన తెగల్లో ఉండే పెద్ద తెగలను కొండ జమీందార్లు అనేవారు. వీరు కొండల్లో దొరికే వస్తువులతో వ్యాపారం చేసేందుకు మైదాన ప్రాంతాలకు వస్తుండేవారు. అలా వచ్చిన వీరు కొందరు మైదాన ప్రాంతాలకు సమీపంగా ఉండే అటవీ ప్రాంతాల్లోనే తాత్కలిక నివాసాలు ఏర్పాటు చేసుకునే వారు. అలా కొందరు మైదాన ప్రాంతాల్లోనే స్థిరపడిపోయారు’’ అని ఆయన వివరించారు.

‘‘కొన్ని గిరిజన తెగల్లో వాళ్లు మైదాన ప్రాంతంలో ఉండే జమీందార్లకు సేవకులుగా ఉండేందుకు వచ్చేవారు. వారు వ్యవసాయం అటవీ ఉత్పత్తుల సేకరణకు వీలుంటుందని స్థానిక అటవీ ప్రాంతాల్లోనే నివాసం ఏర్పాటు చేసుకునేవారు. తరాలు గడుస్తున్న కొద్దీ వారు మైదాన ప్రాంతాల ప్రజలతో కలిసిపోయారు. విశాఖ ఒకప్పుడు పెద్ద వ్యాపార కేంద్రం, అలాగే ఎక్కువ అడవులున్న ప్రాంతం కావడంతో శంభువానిపాలెం గిరిజనులు అలా వచ్చినవారై ఉంటారు" సూర్యనారాయణ చెప్పారు.

  • విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం

ప్రవేశం నిషిద్ధం

శంభువానిపాలెం వెళ్లాలంటే చెక్ పోస్టు వద్ద అటవీశాఖ సిబ్బంది అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి... ఊరిలోని ఎవరైనా తెలిసినవారు 'మావాళ్లే' అని చెప్తే అన్ని వివరాలు తీసుకుని లోపలికి అనుమతిస్తారు.

బీబీసీ బృందం కూడా అటవీ శాఖ అనుమతితో శంభువానిపాలెంలోకి ప్రవేశించింది.

చెక్ పోస్టు నుంచి రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తరువాత శంభువానిపాలెం గ్రామం కనిపిస్తుంది. గ్రామంలోకి వెళ్తుండగానే తుమ్మిగెడ్డ రిజర్వాయర్ కనిపిస్తుంది. అది దాటుతుండగా...సెల్ ఫోన్ సిగ్నల్ కట్ అయిపోతుంది. జీవీఎంసీ పరిధిలో ఉండటంతో చెక్ పోస్టు నుంచి గ్రామం వరకూ తారురోడ్డు వేశారు.

"శంభువానిపాలెంలోకి ప్రవేశం నిషిద్ధం. ఎందుకంటే ఇది కంబాలకొండ అభయారణ్యంలో ఉంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఇది పూర్తిగా అటవీశాఖ అధ్వర్యంలో ఉంది. శంభువానిపాలెంలో అటవీశాఖ తరపున బేస్ క్యాంపు కూడా ఏర్పాటు చేశాం. అభయారణ్య ప్రాంతంలో ఇది ఉండటంతో...ఇక్కడ చేపలు పట్టడం, వన్యప్రాణులను వేటాడటం, తుపాకీ ఉపయోగించడం, చెట్లు తగలబెట్టడం, చెత్త వేయడం, మద్యం తాగడం, రిజర్వాయర్‌లో ఈతకొట్టడం వంటి పనులు చేయకూడదు. అది వన్యప్రాణి చట్టం సెక్షన్ 51 ప్రకారం నేరం. నగరపరిధిలో ఉన్న ప్రత్యేకమైన గ్రామం ఇది" అని విశాఖపట్నం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ అనంత్ శంకర్ చెప్పారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం