వాణీ విశ్వనాథ్ నట వారసురాలు టాలీవుడ్ ఎంట్రీ
ఇండస్ట్రీకి చాలా మంది హీరోయిన్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. భాషతో సంబంధం లేకుండా అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు వర్షా విశ్వనాథ్. ఆమె ఎవరో కాదు. ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ సోదరి ప్రియా విశ్వనాథ్ కూతురు. వాణీ విశ్వనాథ్‌కు నట వారసురాలిగా తెలుగు పరిశ్రమలో అడుగుపెడుతున్నారు వర్ష. కేరళలోని త్రిస్సూర్‌లో ఇంటర్ పూర్తి చేసిన వర్షా విశ్వనాథ్ తమిళంలో మూడు చిత్రాల్లో నటించారు.
‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ చిత్రంతో ఇప్పుడు టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. రమణ్ కథానాయకుడిగా శిరీషారెడ్డి నిర్మిస్తున్న చిత్రమిది. ఎం.రమేశ్, గోపీ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వర్ష పక్కింటి అమ్మాయిగా కనిపించనుందని దర్శక నిర్మాతలు వెల్లడించారు. ఒక సినిమా సెట్ మీద ఉండగానే మరో రెండు చిత్రాలకు సంతకం చేశారు వర్ష. రెండో చిత్రం హీరో రమణ్‌తో వట్టికూటి చంద్ర దర్శకత్వంలో చేయనున్నారు. సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరితో ఓ సినిమా చేయడానికి వర్షా విశ్వనాథ్ అంగీకరించారు. ఇవి కాకుండా తమిళంలోనూ సినిమాల్లో నటించారు వర్షా విశ్వనాథ్.