ఐదు నెలల్లో 2.61కోట్లమంది ఉపాధి గల్లంతు
రోడ్డునపడ్డారు..
- ఇందులో దినసరి కార్మికులు కోటీ 70 లక్షలమంది : సీఎంఐఈ నివేదిక
- నిర్మాణ, తయారీ, పర్యాటకం, వాణిజ్యరంగాల్లో ఉద్యోగాల కోత
- చోద్యం చూస్తున్న కేంద్ర సర్కార్ : రాజకీయ విశ్లేషకుల
న్యూఢిల్లీ : కరోనా రెండో వేవ్ దెబ్బకు కోట్లాది మంది ఉపాధికోల్పోయి రోడ్డునపడే పరిస్థితి ఏర్పడింది. ఆందోళనకరమైన విషయం ఏమంటే..ఈసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు శాశ్వతంగా పోయాయి. ఇవి తిరిగి మళ్లీ ఏర్పడే అవకాశం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు దేశవ్యాప్తంగా 2.6కోట్ల ఉద్యోగాలు పోయాయని, వైరస్ ఉధృతి తీవ్రస్థాయిలో నమోదైన ఏప్రిల్, మే నెలల్లో 2.2కోట్ల ఉద్యోగాలు పోవటం నమోదైందని 'సీఎంఐఈ' తాజా సర్వే పేర్కొంది. వివిధ రాష్ట్రాలు ఎక్కడికక్కడ లాక్‌డౌన్‌లు విధించటం ఉపాధిరంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా అసంఘటితరంగంలో పనిచేసే దినసరి కార్మికులు పెద్ద సంఖ్యలో ఉపాధిని కోల్పోయారని నివేదిక తెలిపింది. గత ఏడాది చేసినట్టుగానే కేంద్రం ఈసారి కూడా ఉపాధి కోల్పోయినవారిని గాలికి వదిలేసింది. వారి సంక్షేమం, ఉద్యోగ భద్రతకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు.
సీఎంఐఈ శాంపిల్ సర్వేలో తేలిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో దేశవ్యాప్తంగా ఉపాధిని కలిగినవారి సంఖ్య 40.1కోట్లుగా అంచనావేశారు. ఫిబ్రవరి, మార్చినాటికి ఆ సంఖ్య 39.8కోట్లకు తగ్గింది. ఏప్రిల్ (39.1 కోట్లు), మే నెలలో (37.6 కోట్లు) మరింత తగ్గుముఖం పట్టింది. దినసరి కూలీలు పెద్ద సంఖ్యలో ఉపాధి కోల్పోయారు. పట్టణాల్లో వీధి వ్యాపారులు, దుకాణాదారులు, ప్రయివేటు ఉద్యోగులు దాదాపు 90లక్షలమంది ఉపాధి దెబ్బతిన్నది. కేవలం రెండు నెలల (ఏప్రిల్, మే) వ్యవధిలో వీరి బతుకులు ఆగమయ్యాయని పరిశోధకులు పేర్కొన్నారు.
ఖరీఫ్ ఒక్కటే కాపాడింది !
వివిధ రంగాల్లో ఉపాధి కోల్పోయిన వారిని వ్యవసాయరంగమే ఆదుకుంది. దేశవ్యాప్తంగా ఖరీఫ్ పంటసాగు పనుల ద్వారా దాదాపు 38లక్షల మందికి ఉపాధి లభించిందని సీఎంఐఈ అంచనావేసింది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల రబీ పంట సాగు తుది దశకు చేరుకోగా, మే నెలలో ఖరీఫ్ పంటసాగు పనులు మొదలవ్వటం కొంత ఊరటనిచ్చిందని, తద్వారా లక్షలాది మందికి ఉపాధి దొరికిందని సర్వే తెలిపింది.
సగం సిబ్బందితో..
కరోనా రెండో వేవ్, లాక్‌డౌన్ నిబంధనల నేపథ్యంలో నిర్మాణరంగం పూర్తిగా స్తంభించిపోయింది. ఇక తయారీ రంగంలో పరిశ్రమలన్నీ సగం సిబ్బందితో నడిచాయి. లాక్‌డౌన్ నిబంధనలు సాకుగా చూపుతూ యాజమాన్యాలు వేతన ఉద్యోగుల్ని తొలగించారు. మొత్తం కార్మికశక్తిలో 50శాతం మందితో ఉత్పత్తి కొనసాగించాయి. కోవిడ్ కారణం చూపి ఎవర్నీ తొలగించవద్దని, వేతనాల్లో కోతలు విధించవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకురాలేకపోయాయి. యాజమాన్యాల సమస్యల్ని పరిష్కరించే ఆసక్తి చూపకపోవటమూ సమస్యను జఠిలం చేసింది.
వేధిస్తున్న నిరుద్యోగ సమస్య
దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చిందని సీఎంఐఈ తెలిపింది. మే నెలలో నిరుద్యోగ రేటు సగటున 12శాతం నమోదైంది. ఇక పట్టణ నిరుద్యోగరేటు 15శాతానికి చేరుకుంది. నగరాలు, పట్టణాల్లో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు గ్రామాల్లో వ్యవసాయ కూలీలుగా మారారు. దాంతో వారి ఉపాధి సమస్య తాత్కాలికంగా సర్దుబాటు అయ్యింది. అయితే తయారీ, పర్యాటకం, వాణిజ్యం (దుకాణాదారులు, షాపింగ్ మాల్స్..మొదలైనవి) రంగాల్లో ఉపాధి కోల్పోయినవారు ఇంటికే పరిమితమయ్యారని, వారి ఆదాయాలు అనూహ్యంగా దెబ్బతిన్నాయని నివేదిక తెలిపింది.
ఎవరెవరు?
దినసరి కూలీలు 1.72కోట్ల మంది
వీధి వ్యాపారులు 57లక్షలు
వేతన ఉద్యోగులు 32లక్షలు
మొత్తం 2.61కోట్ల మంది
నిర్మాణరంగం 88లక్షల మంది(ఉపాది కోల్పోయినవారు)
తయారీరంగం 42లక్షలు
హోటల్స్, పర్యాటకం 40లక్షలు
హోల్‌సేల్, రిటైల్ వాణిజ్యం 36లక్షలు
రెండంకెలు దాటుతోంది..
కాలం ఇండియా పట్టణాలు గ్రామాలు
జనవరి 2021 6.5 శాతం 8.1 5.8
(నిరుద్యోగ రేటు)