బాలల విద్య కు వ్యతిరేకమైన పునర్వ్యవస్థీకరణ.....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రకారం 1 నుండి 5 తరగతులు నిర్వహించబడుతున్న ప్రాథమిక పాఠశాలల స్థాయి తగ్గించి రెండవ తరగతి వరకే ఫౌండేషన్ కోర్సులు గా నిర్వహిస్తారు. 3, 4, 5 తరగతులను 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలకు లేదా ఉన్నత పాఠశాలకు తరలిస్తారు. అంటే ఈ తరగతుల బాలబాలికలు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లి తిరిగి రావలసి ఉంటుంది. దీని ఫలితంగా విద్యార్థులు పెద్దఎత్తున బడి మానివేసే ప్రమాదం ఉంది. ఈ విధంగా సుమారు 34 వేల ప్రాథమిక పాఠశాలలు స్థాయి కుదింపునకు గురవుతాయి. లక్షలాది మంది విద్యార్థులకు విద్య దూరం అవుతుంది. సారాంశంలో ఇది పాఠశాలల మూసివేత అని గ్రహించాలి. ప్రస్తుతం అమలులో ఉన్న విద్యా హక్కు చట్టం ప్రకారం బాల బాలికలకు తమ ఆవాస ప్రాంతం నుండి ఒక కిలో మీటర్ల దూరంలో 5 వ తరగతి వరకు విద్య అందుబాటులో ఉండాలి. ప్రభుత్వ ప్రతిపాదనలు ఈ నిబంధనకు వ్యతిరేకమైనవి. పంచాయతీకి ఒక సర్వ సమగ్రమైన ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని కొద్దిమంది ప్రతిపాదిస్తున్నారు. ఇది వినడానికి బాగుంటుంది కానీ ఇది కూడా ఒక కిలోమీటరు లోపల బాల బాలికలకు ఐదో తరగతి వరకు విద్య అందించాలి అన్న నిబంధనకు తూట్లు పొడవడమే. ఇది ప్రమాదకరమైన ప్రత్యామ్నాయం. ఒక కిలోమీటరు సామీప్యత నిబంధనను ఉల్లంఘించే అవకాశాన్ని ప్రభుత్వానికి మనం ఇవ్వకూడదు....