*బంగారం కోసం భక్తురాలిని రాడ్డుతో కొట్టి చంపేసిన పూజారి*

*శవం నుండి దుర్వాసన రాకుండా అగరబత్తుల ధూపం* 

*హైదరాబాద్ లో దారుణం*

బంగారం కోసం ఏకంగా ఒక భక్తురాలిని పూజారి హత్య చేశాడు. పోలీసులు కథనం ప్రకారం.. "హైదరాబాద్ మల్కాజ్‌గిరికి చెందిన అనుముల మురళీ కృష్ణ (42) మల్కాజ్‌గిరి విష్ణుపురి కాలనీలోని స్వయంభు సిద్ధి వినాయక గుడిలో పూజారిగా ఉన్నారు. అదే ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి గొర్తి నారాయణ మూర్తి  (60) భార్య గొర్తి ఉమాదేవి (57) ప్రతీరోజూ సిద్ధి వినాయక గుడికి వెళ్తూ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఎప్పటిలాగే ఈ నెల 18వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు గుడికి వెళ్ళారు. కానీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో 7:30 గంటల ప్రాంతంలో భర్త నారాయణ మూర్తి గుడికి వచ్చి తన భార్య వచ్చిందా అని పూజారిని అడిగారు. ఉమాదేవి వచ్చి వెళ్ళిపోయారని పూజారి ఆమె భర్తకు చెప్పారు. కానీ ఆమె చెప్పులు గుడి బయట కనిపించడంతో, దగ్గర్లో ఎక్కడికైనా వెళ్ళి ఉంటుదేమోనని కొంతసేపు అక్కడే ఎదురుచూశారు. ఎంత సేపటికీ ఆమె రాకపోవడంతో గుడి చుట్టుపక్కల వెతికారు. ఎంత వెతికినా ఆమె కనిపించలేదు. ఆమె ఫోన్ కూడా గుడికి తీసుకెళ్ళలేదు. దీంతో తన భార్య కనపడడం లేదని నారాయణ మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


*ఇలా బయటపడింది..* 

ఆమె గుడికి వచ్చినప్పడు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అక్కడ ఎవరూ లేరు. అదను చేసుకున్న పూజారి ఆమెతో ఏదో మాట్లాడుతున్నట్టుగా నటించి, తలపై పలుసార్లు ఇనుప రాడ్డుతో కొట్టి చంపేశాడు. ఉమా దేవి చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత ఆమె మృతదేహాన్ని ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో ఉంచి దానిపై మూత పెట్టేసి, ముందే సిద్ధం చేసుకున్న నీటితో నేలను శుభ్రంగా కడిగేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకొని, అదే కాలనీలో బంగారం షాపు నడుపుతున్న నందకిషోర్ జోషికి అమ్మాడు. ఆమె శవాన్ని గుర్తు తెలియని ప్రాంతానికి ఒక ట్రాలీలో తీసుకెళ్ళాలని పూజారి అనుకున్నాడు. కానీ, పోలీసులు, స్థానికులు చుట్టుపక్కల వెతుకుతుండడంతో ఆ పనిని విరమించుకున్నాడు. రెండు రోజులుగా శవం అక్కడే ఉండడంతో, దుర్వాసన రావడం మొదలైంది. 21వ తేదీ తెల్లవారుజామున పూజారి గుడికి వెళ్ళి, ఆ డ్రమ్మును దొర్లించుకుంటూ గుడి వెనుకకు తీసుకొని వెళ్ళాడు. అందులో నుండి మృతదేహాన్ని బయటకు తీసి రైల్వే ట్రాక్ దగ్గర ముళ్ల పొదల్లో పడేసాడు. తరువాత డ్రమ్మును లైజాల్‌తో కడిగేసి మామూలుగా ఉండే చోట పెట్టేశాడు. అయినప్పటికీ దుర్వాసన వస్తుండడంతో మళ్లీ ఆ చోటును నీటితో శుభ్రం చేసి అగరబత్తుల పొగ వేశాడు’’ విచారణలో భాగంగా పోలీసులు పూజారిని అనుమానించి అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఆయన తన నేరాన్ని అంగీకరించాడు. అతనితో పాటు బంగారం షాపు యజమానిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. తనకున్న ఆర్థిక ఇబ్బందులు తీర్చుకోవడం కోసం ఆమెను చంపి బంగారం దొంగిలించానని పూజారి విచారణాలో పోలీసులకు చెప్పాడు. నిందితుడు ఉపయోగించిన రెండు ఇనుప రాడ్డులు, ప్లాస్టిక్ డ్రమ్ము, హత్య సమయంలో పూజారి వేసుకున్న బట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం