గ్రామస్థాయిలో రైతులకు సలహాలు ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి
అనకాపల్లి, జూన్ 17టుడే, న్యూస్: వ్యవసాయ అనుబంధ శాఖల గ్రామస్థాయి అధికారులు రైతులకు అందుబాటులో ఉండి సకాలంలో తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులు క్రిమిసంహారక మందులతోపాటు పశువులకు అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బంది మరింత సామర్థ్యంతో పని చేసే విధంగా వారికి శిక్షణా కార్యక్రమాలు ఇస్తూ ఉండాలన్నారు. కోతుల బెడద ఎక్కువగా ఉన్నదని కొంతమంది రైతులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా సోమవారం నుండి కోతులను పట్టే కార్యక్రమం చేపట్టాలని అటవీ అధికారులను ఆదేశించారు. సమావేశంలో రైతులు తమ సమస్యలను కలెక్టర్ కు తెలియజేయగా వాటిని వెంటనే పరిష్కరించే వలసిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలు ద్వారా ప్రభుత్వం రైతులకు అన్నింటినీ అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా వ్యవసాయ అధికారి లీలావతి, శాస్త్రవేత్త భరత లక్ష్మి, మత్స్య, ఉద్యానవన, పశుసంవర్ధక, నీటిపారుదల శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.