*అవసరం కోసం ఆన్‌లైన్‌ రుణ యాప్‌లో చేసిన రూ.6000 అప్పు..*


*ఓ అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్‌ పాలిట యమపాశమైంది..

సొమ్ము సకాలంలో చెల్లించలేదనే నెపంతో.. నీ భార్య ఫోన్‌ నెంబర్‌ అశ్లీల వెబ్‌సైట్‌లో పెడితే రోజుకు రూ.1000 వస్తాయంటూ ఆ యాప్‌కు చెందిన వ్యక్తులు చేసిన వేధింపులు అతన్ని ఆత్మహత్యకు పురిగొల్పాయి. అవమానం భారంతో రైలు కింద పడి ప్రాణం తీసుకునేలా చేశాయి. దీంతో ఆన్‌లైన్‌ రుణయాప్‌ వేధింపులకు మరో వ్యక్తి బలవ్వగా.. జల్‌పల్లి-శాస్త్రిపురం మార్గంలో మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జల్‌పల్లికి చెందిన యంజాల సుధాకర్‌(33) చందులాల్‌ బారదరి ఫైర్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య మాధవితోపాటు 18 నెలల వయస్సున్న కూతురు ఉన్నారు. అయితే, గోల్డెన్‌ రూపీ అనే రుణయాప్‌ నుంచి తీసుకున్న రూ.6 వేలు రుణాన్ని సుధాకర్‌ సకాలంలో చెల్లించలేకపోయారు.

దీంతో ఆ యాప్‌ ఏజెంట్ల నుంచి వేధింపులకు గురయ్యారు. ఎన్నిసార్లు బాకీ సొమ్ము చెల్లించినా ఇంకా బకాయి ఉన్నావంటూ వేధించేవారు. అసభ్య పదజాలంతో ఫోన్‌కు మెసేజ్‌లు పెట్టి మానసికంగా హింసించేవారు. నీ భార్య నంబర్‌ అశ్లీల వెబ్‌సైట్‌లో పెడితే.. ఒక్కో కస్టమర్‌ నుంచి రూ.1000 వస్తాయని సందేశాలు పంపేవారు. అంతేకాక, సుధాకర్‌ ఓ మోసగాడు అంటూ అతని కాంటాక్ట్‌ లిస్టులో ఉన్న పలువురికి మెసేజ్‌లు పెట్టారు. వీటన్నింటితో మనస్తాపం చెందిన సుధాకర్‌ ఇటీవల సన్నిహతుల వద్ద తన కష్టం చెప్పుకున్నారు. కానీ, మంగళవారం ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయటకెళ్లిన సుధాకర్‌ 6:12 నిమిషాలకు అన్న కుమార్‌కు ఫోన్‌ చేసి తన నిర్ణయం చెప్పారు. అనంతరం శివరాంపల్లి - శాస్త్రీపురం మార్గంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించారు. ఈ కేసు ప్రస్తుతం రైల్వే పోలీసుల దర్యాప్తులో ఉంది.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం