*అటు రైలు, ఇటు రోడ్డు మార్గం మూసివేత,పది రోజుల పాటు రాకపోకలు బంద్‌*


*రూ.4 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణం*

*మూడు రోజుల పాటు నిర్మాణ పనులు*

*ట్రాఫిక్‌ మళ్లింపుతో తప్పని కష్టాలు*

*రైళ్ల మళ్లింపుపై నేడు ప్రకటన*

*వన్‌టౌన్‌వాసులకు చుక్కలే..*

*ప్రత్యామ్నాయ మార్గాలతో ఇబ్బందులే*

 విజయవాడ: రెండు దశాబ్దాల తర్వాత వన్‌టౌన్‌లోని లోబ్రిడ్జికి మరమ్మతులు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రైల్వే భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త బ్రిడ్జి గడ్డర్లను ఏర్పాటుచేసే పనిని బుధవారం నుంచి మొదలుపెడతారు. పది రోజుల పాటు జరిగే పనుల్లో భాగంగా అటు రైళ్లతో పాటు ఇటు రోడ్డు మార్గాన్ని కూడా నిలిపివేయనున్నారు. కీలకమైన ఈ దారి మూతపడటంతో నగరానికి ట్రాఫిక్‌ కష్టాలు తప్పేలా లేవు. మరోవైపు రైళ్లను కూడా భారీగా దారి మళ్లించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

 దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ముఖ్యమైన కారిడార్లలో విజయవాడ-గుంటూరు-గూడూరు- గుంతకల్‌-చెన్నై మార్గం కీలకమైనది. అత్యంత బిజీ అయిన ఈ మార్గంలో ఉన్న లోబ్రిడ్జి ఎంతో ప్రధానమైనది. విజయవాడ రైల్వేస్టేషన్‌కు కూతవేటు దూరంలో, కాళేశ్వరరావు మార్కెట్‌ నుంచి కృష్ణా తూర్పు ప్రధాన కాల్వ మీదుగా ఈ బ్రిడ్జి ఉంది. తూర్పు ప్రధాన కాల్వపై పదేళ్ల కిందట దీనిని రీ-ప్లేస్‌మెంట్‌ చేశారు. ప్రస్తుతం కాళేశ్వరరావు మార్కెట్‌ నుంచి తూర్పు ప్రధాన కాల్వ వరకు ఉన్న లోబ్రిడ్జిని పూర్తిగా తొలగించి కొత్త దానిని అభివృద్ధి చేస్తారు. ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు ఈ పనులు జరుగుతాయి.

*రూ.4 కోట్లతో పనులు*

రెండు దశాబ్దాలుగా రైల్వేకు లోబ్రిడ్జి ఎనలేని సేవలందిస్తోంది. దీని మీదుగా మూడు ప్రధాన రైల్వేలైన్లు వెళ్తున్నాయి. ఇటీవల కాలంలో ఇండియన్‌ రైల్వేస్‌ బ్రిడ్జి పరిశీలనా బృందం తనిఖీల్లో భాగంగా ఈ వంతెనను ప్రమాదకర జాబితాలో చేర్చారు. పూర్తిగా తొలగించి కొత్త గడ్డర్లతో రీ స్ట్రక్చర్‌ చేయాలని నిర్దేశించారు. దీంతో విజయవాడ రైల్వే డివిజన్‌ అధికారులు లోబ్రిడ్జిని తొలగించి నూతన గడ్డర్లతో అభివృద్ధి చేయనున్నారు. అయితే, ఈ పనులను మూడు రోజుల్లో పూర్తి చేయాలని విజయవాడ డివిజన్‌ రైల్వే ఇంజనీరింగ్‌ బృందం భావిస్తోంది. ఇందుకోసం రూ.4 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

*మూడు ట్రాక్‌లకు మూడు రోజులు*

మూడు రైల్వేట్రాక్స్‌కు సంబంధించి లోబ్రిడ్జి పనులను ఒకేసారి మొదలుపెడితే ఇబ్బందులు పడే అవకాశం ఉండటంతో ఒక్కో దానికి ఒక్కోరోజు చొప్పున మూడు బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని చూస్తున్నారు. మరో రెండు దశాబ్దాలకు పైగానే ఉండేలా ఈ పనులు జరుగుతాయి.

*భారీగా రైళ్ల మళ్లింపు*

పనుల కారణంగా ఈనెల 13 నుంచి 23వ తేదీ వరకు పది రోజుల పాటు రైళ్లను దారి మళ్లించనున్నారు. రైళ్లన్నింటినీ రాయనపాడు మీదుగా మళ్లించే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. విజయవాడ, గుంటూరు, గూడూరు, గుంతకల్‌, చెన్నైకు రాకపోకలు సాగించే రైళ్లను రాయనపాడు స్టేషన్‌ మీదుగా, సికింద్రాబాద్‌కు వెళ్లే రైళ్లను జగ్గయ్యపేట మీదుగా థర్డ్‌లైన్‌ ద్వారా మళ్లించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై మంగళవారం అధికారిక ప్రకటన రానుంది.

*రోడ్డు మార్గంలో ఇబ్బందులే..*

లోబ్రిడ్జి రీప్లేస్‌మెంట్‌ కారణంగా ప్రధానంగా వన్‌టౌన్‌ వాసులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పనులు జరిగే మూడు రోజులు ట్రాఫిక్‌ కష్టాలు తప్పేలా లేవు. అయితే, నగరవాసులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వద్ద ఫ్లై ఓవర్‌ ఉన్నప్పటికీ బస్సులు రాకపోకలు సాగించటానికి లేదు. ఇప్పటికే ట్రాఫిక్‌ సంస్కరణల్లో భాగంగా ఫ్లై ఓవర్‌పై ప్రయాణాలకు ఆంక్షలు ఉన్నాయి. గట్టువెనుక ప్రజలు మాత్రం కనకదుర్గా ఫ్లై ఓవర్‌ మీదుగా నగరంలోకి చేరుకునే అవకాశం ఉంటుంది.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*