మహోన్నత వ్యక్తికి మహాసన్మానం
*14న పద్మశ్రీ సుంకర ఆదినారాయణకు ఘనసత్కారం
*జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహణ
*భారీగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు
*అందరూ ఆహ్వానితులే..గుంటూరు పిలుపు
విశాఖపట్నం,ఆగస్టు 9,టుడే న్యూస్ : ప్రముఖ సంఘసేవకులు, ఎంతో మంది పోలియో బాధితులకు తన ఆపన్నహస్తం అందించిన ప్రముఖ వైధ్యులు, పద్మశ్రీ డాక్టర్ సుంకర ఆదినారాయణను ఈనెల 14న ఘనంగా సన్మానించనున్నారు. విశాఖజిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో వుడా బాలల ఏరీనాలో ఈ సన్మాన సత్కార కార్యక్రమం జరగనుంది. ఆరోజు సాయంత్రం 5 గంటల నుంచి పలు సాంస్కృతిక కార్యక్రమాలుతో సన్మానసభ ప్రారంభం కానున్నట్లు విశాఖజిల్లా సిటిజన్ ఫోరమ్ కార్యనిర్వాహక కార్యదర్శి గుంటూరు వెంకటనరసింహరావు, ఏపి ఓసీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సత్తి వీరరాఘవరెడ్డి మంగళవారం తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో సన్మాన సభ ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ చార్జి మంత్రి విడదల రజిని, ఇతర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఆయా సంస్థల అధ్యక్షులు, ఇలా పలువురు హాజరు కానున్నట్లు వీరు వివరించారు. జిల్లా కలెక్టర్ మల్లికార్జున అధ్యక్షతన జరిగే సుంకర ఆదినారాయణ సన్మానసభకు అందరూ ఆహ్వానితులేనన్నారు. అనేక రాష్ర్టాల్లో సుంకర అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. రాజస్థాన్ లో అనేక మంది నేటికి సుంకర ఆదినారాయణ అందించిన సేవలు గుర్తించుకొని వారి ఇళ్లలో ఫోటోలు సైతం ఏర్పాటు చేసుకొని ఆరాధిస్తున్నట్లు చెప్పారు. పోలియో బారిన పడిన ఎంతో మందిని ఆదుకున్న ఘనత సుంకరకే దక్కుతుందన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తిని ప్రభుత్వం గుర్తించి జిల్లా అధికార యంత్రాంగం ద్వారా ఘనంగా సత్కరించేందుకు నిర్ణయించడం అభినందనీయమన్నారు. తాము కోరిన అనంతరం జిల్లా అధికార యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకున్నందుకు పలువురు పెద్దలు, జిల్లా అధికార యంత్రాంగానికి ఇతర ప్రజాప్రతినిధులకు తాము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు గుంటూరు చెప్పారు. ప్రజా వైద్యుడిగా పేరుగాంచిన సుంకర సన్మానసభను జయప్రదం చేయాలని ఆయన కోరారు.