తిరుమల బ్రహ్మోత్సవాలలో స్వామి వారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు
విజయవాడ, అక్టోబర్ 3: బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ దంపతులు మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలను సందర్శించి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం తిరుమల ఆలయానికి చేరుకున్న గవర్నర్ శ్రీ హరిచందన్‌కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కార్యనిర్వహణ అధికారి ఎవి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ సంప్రదాయ మర్యాదలతో స్వాగతం పలికి, దర్శన సమయంలో గవర్నర్ వెంట ఉన్నారు. దర్శనానంతరం గవర్నర్ దంపతులకు ఆలయ అర్చకులు శేషవస్త్రాలు, వేద ఆశీర్వచనం అందజేశారు. తొలుత రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో గవర్నర్ హరిచందన్‌కు తిరుపతి జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి, అనంతపురం రేంజ్ డిఐజి రవిప్రకాష్, తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉప కులపతి జమున ఘనంగా స్వాగతం పలికారు. తిరుమల పర్యటన ముగించుకున్న అనంతరం గవర్నర్ హరిచందన్ రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు.