కన్నుల పండువగా శ్రీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం
విజయనగరం, 2022 అక్టోబర్ 18, టుడే న్యూస్:
ఉత్తరాంధ్ర ప్రజల కల్పవల్లి, శీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం మంగళవారం సాయంత్రం పెదచెరువులో, మంగళ వాయిద్యాల నడుమ, సంప్రదాయ బద్దంగా, కన్నుల పండువగా జరిగింది. పైడిమాంబ తాను వెలసిన స్థలం పెద్ద చెరువులో, హంస వాహనంలో ముమ్మారు విహరించారు. ఈ అపూర్వ దృశ్యాన్ని చూసి భక్తులు పులకించారు.
నిర్ణీతముహూర్తంలో పైడితల్లి ఆలయం నుండి అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేక పల్లకిలో తిరువీధోత్సవం నిర్వహించి, పెదచెరువు పడమటి భాగానికి చేర్చారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన హంసవాహన పడవపై తెప్పోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, ఏపీ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు, ఆర్డీవో ఎంవి సూర్యకళ, జిల్లా మత్స్య శాఖాధికారి నిర్మలాకుమారి, దేవాదాయ శాఖ ఆర్జేసి ఎన్వీఎస్ఎన్ మూర్తి, పైడితల్లి అమ్మవారు దేవస్థానం ఇఓ బిహెచ్.వి.ఎస్ఎన్.కిషోర్ కుమార్ , మాజీ ఎంఎల్సిగాదె శ్రీనివాసులు నాయుడు, ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు, వేదపండితులు, పలువురు పాలకమండలి సభ్యులు, అధికారులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి సంబరంగా ఉత్సవాన్ని నిర్వహించారు.