పోలీసు లేని సమాజాన్ని ఊహించలేము - పోలీసుల త్యాగాలు మరువలేం పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో మంత్రి :అమర్నాథ్


-- పోలీసు శాఖకు అండగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం



విశాఖపట్నం, 2022 అక్టోబర్ 21, టుడే న్యూస్: పోలీసుల త్యాగాలు మరువలేనివని, శాంతి భద్రతల పరిరక్షణకు అహర్నిశలు శ్రమిస్తున్న  పోలీసు సిబ్బంది సేవలు శ్లాఘనీయమని, పోలీసు లేని సమాజాన్ని ఊహించుకోలేమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.  పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక బీచ్ రోడ్ లోని పోలీస్ మెస్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం దగ్గర శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి అమర్నాథ్ పాల్గొని అమరవీరులకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లడ్హాక్ లో 63 సంవత్సరాల కిందట అసువులు బాసిన 10 మంది పోలీసుల బలిదానాన్ని స్మరించుకుని ఈ అమరవీరుల దినోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నారని చెప్పారు. అమరవీరుల స్ఫూర్తితో పోలీసులు ప్రభుత్వంలోని మిగిలిన ఉద్యోగుల కన్నా, అధికంగా శ్రమిస్తున్నారని, సమాజంలో వారి పాత్ర, వారి యూనిఫామ్ కు వున్న  గౌరవం ఎంతో గొప్పదని మంత్రి అమర్నాథ్ అన్నారు. పోలీసు వ్యవస్థలో ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి వరకు పనిచేస్తున్న సిబ్బంది అందరినీ ప్రజలు ఎల్లప్పుడూ గౌరవిస్తూనే ఉన్నారని ఆయన అన్నారు. వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం పెన్ డౌన్ చేసిన సంఘటనలు ఉన్నాయి. అదే పోలీస్ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులకు సమస్యలు ఉన్నా, ఎప్పుడు గన్ డౌన్ చేయలేదని, అదే ఈ శాఖ గొప్పతనం అని అమర్నాథ్ కొనియాడారు.

కోవిడ్ సమయంలో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్న పరిస్థితుల్లో కూడా పోలీసులు నిరంతర సేవలు అందించారని , ఈ సందర్భంలోనే జిల్లాలో 8 మంది పోలీసులు కరోనా బారిన పడి చనిపోయారని అని చెప్పారు. పోలీసుల సేవలకు 130 కోట్ల మంది ప్రజలు రుణపడి ఉంటారని అమర్ నాథ్ అన్నారు. కోవిడ్ తో చనిపోయిన పోలీస్ సిబ్బంది  కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందని హామీ ఇచ్చారు. కోవిడ్ తో చనిపోయిన పోలీసు సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు లక్షల రూపాయలు చెల్లించిన విషయాన్ని మంత్రి అమర్నాథ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేసి, సిబ్బందిపై ఒత్తిడి తగ్గించేందుకు కొత్తగా 6,511 పోస్టుల భర్తీకి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని అమర్ నాథ్ తెలియజేశారు. దేశ సార్వభౌమత్వాన్ని సూచించేది మూడు సింహాలు అయితే, శాంతిభద్రతల కోసం పనిచేస్తున్న పోలీసు వ్యవస్థ నాలుగో సింహంఅని అమర్నాథ్ ప్రస్తుతించారు. 

పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది శారీరక మానసిక ఒత్తిడిని తట్టుకుని కూడా విధులు నిర్వహిస్తున్నారని ఆధునిక జీవన శైలి పోలీసు వ్యవస్థపై అనేక సవాళ్లు విసురుతున్నాయని అన్నారు. మహిళలపై అత్యాచారాలు, సైబర్ నేరాలు పోలీసు వ్యవస్థపై మరింత ఒత్తిడిని పెంచుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాం ఎందుకు అంతా సిద్ధంగా ఉన్నామని కమిషనర్ తెలియజేశారు.

ఇదిలా ఉండగా విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన త్రీటౌన్ సీఐ కరణం ఈశ్వరరావు భార్యకు మంత్రి అమర్నాథ్ జ్ఞాపికను అందజేశారు.

ఈ కార్యక్రమంలో మేయర్ హరివెంకట కుమారి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు