జర్నలిస్టుల నవరత్నాలను అమలు చేయాలి

 


విశాఖపట్నం: 2022 నవంబర్ 9, టుడే న్యూస్: పాలకులు,ప్రతిపక్ష పార్టీల నేతలు కొన్ని పత్రికలు,మీడియా యాజమాన్యాలపై ఉన్న కక్షను ఎలాంటి జీత భత్యాలు లేకుండా పనిచేస్తున్న పాత్రికేయులపై పగ తీర్చుకునే విధానాన్ని విడనాడాలి. మీకేమైనా ఇబ్బంది కలిగి ఉంటే ఆయా పత్రికల యాజమాన్యాలపై చర్యలు తీసుకోండి. అలా కాకుండా మీపై వ్యతిరేక కథనాలు రాస్తున్న పత్రికలకు, మీడియా సంస్థలకు లక్షలు, కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రకటనల రూపంలో కుమ్మరిస్తూ పాత్రికేయుల సంక్షేమాన్ని మాత్రం విస్మరించడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి.

మమ్మల్ని సమాజంలో పౌరులు, ఓటర్లుగా చూడండి.మాకూ కుటుంబాలు ఉన్నాయి, బంధుమిత్రులు ఉన్నారు.

వాళ్ళు కూడా ఓటర్లేనని గుర్తెరగండి.

జర్నలిస్టులవి గొంతెమ్మ కోరికలు కాదు.మల్లు,మాన్యాలు అడగడం లేదు. ఆచరణ సాధ్యమైనవే కోరుతున్నాం. జర్నలిస్టుల పట్ల మనసులో ఉన్న చెడు ఆలోచనను విడనాడి పెద్ద మనసుతో ఆలోచించి మా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం.

1.పాత్రికేయుల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలి.

2.పాత్రికేయులు,వారి కుటుంబ సభ్యులకు జర్నలిస్ట్స్ హెల్త్ స్కీమ్ ద్వారా ఉచిత వైద్య సదుపాయం కల్పించాలి. ఆరోగ్య, ప్రమాద బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే పూర్తిగా చెల్లించాలి.

3.ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న పాత్రికేయులు ఫోటో వీడియో జర్నలిస్టులకు కనీస వేతనాలు అమలు చేయించి, ఉద్యోగ భద్రత, పీఎఫ్,ఇఎస్ఐ సదుపాయాలు కల్పించాలి.

4.స్థానిక పత్రికలు,వార,పక్ష,మాస పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు 

జారీ చేయాలి.

5.జిఎస్టితో నిమిత్తం లేకుండా అక్రిడిటేషన్లు ఇవ్వాలి.

6.సీనియర్ జర్నలిస్టులకు పింఛను మంజూరు చేయాలి. జర్నలిస్ట్ సహజంగా మరణిస్తే ఐదు లక్షలు ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలను ప్రభుత్వం అందించి 

ఆ కుటుంబాలను ఆదుకోవాలి,

7.అక్రిడిటేషన్ తో నిమిత్తం లేకుండా గ్రామీణ ప్రాంతంలో అయితే రెండేళ్లు, పట్టణ పరిధిలో మూడేళ్లు అనుభవం కలిగిన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇల్లు లేదా ఇంటి స్థలం కేటాయించాలి.

8.అక్రిడిటేషన్ లేని పాత్రికేయులకు మీడియా యాజమాన్యాలు, 

ప్రెస్ క్లబ్ లు, కార్మిక శాఖ గుర్తింపు పొందిన జర్నలిస్ట్స్ యూనియన్లు 

జారీ చేసిన గుర్తింపు కార్డులను అనుమతించాలి.

9.జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు  పటిష్టమైన చట్టాలను రూపొందించి అమలు చేయాలి. పాత్రికేయులపై దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలి.

పైన పేర్కొన్నవి జర్నలిస్టులకు సంబంధించి 'నవరత్నాలు'. వీటిని 

ఏ రాజకీయ పార్టీ అయితే అమలు చేస్తామని కచ్చితమైన హామీ ఇచ్చి వారి మేనిఫెస్టోలో చేర్చిన వారికే రానున్న ఎన్నికల్లో పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మద్దతు ఉంటుందని తెలియజేద్దాం.ఆ దిశగా మనకు అందుబాటులో ఉన్న పత్రికలు, మీడియాల ద్వారా కలం పోరాటాన్ని సాగిద్దాం.

పాత్రికేయ మిత్రులారా ఈ అక్షర ఉద్యమం నా ఒక్కడి కోసం కాదు..,

మనందరి కోసమని గమనించ మనవి.


ఇట్లు మీ శ్రేయోభిలాషి

నేమాల హేమసుందరరావు 

సీనియర్ జర్నలిస్ట్, విశాఖపట్నంఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు