రైతుల ఆరాధ్య దైవం నిత్య కృషివలుడు, విశాఖ డైయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు కన్నుమూత

 

 హైదరాబాద్,2023 జనవరి 4,టుడే న్యూస్: విశాఖ డైయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తులసీరావు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. 1939 ఫిబ్రవరి 1న విశాఖ జిల్లా ఎలమంచిలిలో వెంకటరామయ్య, సీతయ్యమ్మ దంపతులకు జన్మించారు. టెన్త్ వరకే చదివారు. వ్యవసాయంతో బాల్యంలోనే మమేకమయ్యారు. పశుపోషణంటే మక్కువ పెంచుకున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుబతుకే గొప్పదని మనసావాచా నమ్మారు. అందుకే ఆయనను రాజకీయల్లోకి రమ్మనమని ప్రజలే స్వాగతించారు. కృషికార్ లోకా పార్టీ, స్వతంత్ర పార్టీ, జనత, టిడీపీల్లో కీలకమైన పాత్ర పోషించారు. పాతికేళ్లవయస్సు వచ్చేసరికి ఊరిజనం తలలో నాల్క అయ్యారు. 1962లో కోపరెటివ్ అర్బన్ బ్యాంక్ డైరక్టర్గా ఎన్నికయ్యారు. మరో రెండేళ్లకు జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నెగ్గి ఎలమంచిలి గ్రామపంచాయితీ బోర్డు అధ్యక్షుడయ్యారు. ఇరవైయ్యేళ్లపాటు సర్పంచ్గా కొనసాగారు. 1985 కాలంలో అప్పటి తెలుగుదేశం నాయకుల ప్రోద్బలంతో జిల్లాశాఖ అధ్యక్షుడిగా ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉండేవారాయన, అప్పుడే విశాఖడెయిరీకి ఎన్నికలొచ్చాయి. మారిన పరిస్థితుల దృష్ట్యా వెంకటరమణ స్థానంలో డెయిరీ అధ్యక్షుడిగా పాలనాపగ్గాలు చేపట్టవలసివచ్చింది. డెయిరీ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకూ ఆయన చైర్మన్ గా ఎప్పుడూ పనిచేయలేదు. ఒక కార్మికునిగా పాటుపడ్డారు. ఒక పాలరైతుగానే ఆలోచించారు. అందుకే విశాఖ డెయిరీ నేడింతగా ప్రగతి సాధించింది. పాల దిగుబడి పెరగడం నుంచి, డెయిరీ పాల ఉత్పత్తుల శ్రేణిని విస్తృతం చేసే వరకూ ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. రైతు కష్టం మరో రైతుకే తెలుసు. అందుకే రైతుబిడ్డ తులసీరావు వారికోసం ఆసుపత్రి

కట్టించారు. విశాఖడెయిరీకి పాలు ఉత్పత్తి చేసే ప్రతీ రైతుకు ఉచిత వైద్య సౌకర్యాన్ని

అందించారు. రైతుతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఈ పథకాన్ని వర్తింపు చేసారు.

ప్రస్థానంలో ఎన్నో అవార్డులు వరించి వచ్చాయి. ఎన్నో జాతీయ స్థాయి అవార్డులను సాధించింది. 2003లో ఎనర్జీ అండ్ ఫ్యూయల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విశాఖ డెయిరీకి జాతీయ అవార్డును ప్రకటించింది. అదే ఏడాది వాల్తేరు రోటరీ క్లబ్ 'కార్పొరేట్ సిటిజన్ అవార్డు' ను అందజేసింది. ఇండియన్ డెయిరీ అసోసియేషన్ 2005లో బెంగుళూరులో నిర్వహించిన 34వ జాతీయ సదస్సులో విశాఖ డెయిరీకి ప్రశంసా పత్రాన్ని అందజేసింది. 2007లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విశాఖ డెయిరీ ట్రీట్మెంట్ ప్లాంట్ను కాలుష్య రహితంగా నిర్వహిస్తున్నందుకు కాంప్లిమెంటు అవార్డును అందచేసింది. పాలు, పాలఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్న ఉత్తమ డెయిరీగా భారత ప్రభుత్వం నుంచి 2009 సెప్టెంబర్ 24న 'నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ అవార్డు'ను అందుకుంది. ఇండియన్ డెయిరీ అసోసియేషన్ 2010లో బెంగుళూరులో నిర్వహించిన 38వ జాతీయ సదస్సులో విశాఖ డెయిరీకి ప్రశంసా పత్రాన్ని అందజేసింది. డెయిరీ రంగంలో విశేష పురోగతి సాధిస్తున్న సంస్థగా విశాఖ డెయిరీకి 'ఇండియన్ ఎచీవర్స్ అవార్డు 'ను భారత ప్రభుత్వం, ఇండియన్ ఎకనామిక్ డవలప్మెంట్ అండ్ రీసెర్చ్ అసోసియేషన్ సంయుక్తంగా అందజేసాయి. విశాఖ డెయిరీకి ఎన్ని అవార్డులు వచ్చినా ఏనాడూ వాటిని అందుకొనేందుకు ఛైర్మన్ ఆడారి తులసీరావు వెళ్ళలేదు. డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్లోనో, సంస్థ ప్రతినిధులనో పంపించేవారు తప్ప అవార్డులు తీసుకుంటూ తాను గొప్పవాడ్ని అని ఫొటోలకు ఫోజు ఇచ్చేందుకు ఇష్ట పడేవారు కాదు. అవార్డుల కన్నా రైతు ప్రశంసలే తనకు మిన్నని ఆయన వినమ్రంగా చెప్పేవారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*