ఇళ్ల స్థలాల జీవోలో సవరణలు చేయండి
సమాచార శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణకు విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ వినతి
విశాఖపట్నం, 2023,నవంబర్ 22, టుడే న్యూస్ : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ విడుదల చేసిన జీవో ను సవరించాలని కోరుతూ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కు విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. జీవో నంబర్ 535/2023లో ఉన్న కొన్ని నిబంధనలు కారణంగా అత్యధిక శాతం మంది జర్నలిస్టులు ఎటువంటి లబ్ది పొందలేరని ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు. ఒక ప్రైవేట్ హోటల్ లో బుదవారం ఆయనను కలిసిన సొసైటీ ప్రతినిధులు జీవోలో ఉన్న కొన్ని నిబంధనలను సడలించాలని కోరారు. ముఖ్యంగా జర్నలిస్టుల ఆర్దిక పరిస్థితి రీత్యా 60 : 40 ప్రాతిపదికన రూపొందించిన నిబంధనను అందరికీ అనువుగా ఉండేలా 90:10 నిష్పత్తిలో చెల్లించేలా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భార్య పేరున గాని భర్త పేరున గాని ఇళ్ల స్థలం, ఫ్లాట్ ,ఇల్లు ఉంటే అనర్హులని ప్రకటించడం వలన ఎనభై శాతానికి పైగా జర్నలిస్టులు నష్టపోతారని వివరించారు. ఈ నిబంధనను తొలగించేలా కృషి చేయాలని కోరారు.2023లో అక్రిడేషన్ లేని జర్నలిస్టులకు గతంలో వున్న అక్రిడేషన్ల సీనియార్టీ ప్రాతిపదికన ఇళ్ల స్థలాల కేటాయింపునకు అర్హులుగా చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఇటీవల కాలంలో జగనన్న ఇళ్ల పథకంలో గాని, టిడ్కో ఇళ్లు కానీ పొందినవారు వాటిని రద్దు చేసుకొంటే జర్నలిస్ట్ సైట్స్ కి అర్హులుగా ప్రకటించేలా సవరణ చేయాలని కోరారు.విశాఖ నగరానికి దగ్గర్లో , నివాసయోగ్యం ఉన్నచోట స్థలాల కేటాయింపు జరిగేలా చూడాలని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో 1/70 నిబంధన అమల్లో ఉన్నందున అక్కడ పనిచేస్తున్న జర్నలిస్టులకు ఎదురవుతున్న అడ్డంకుల నేపథ్యంలో మైదాన ప్రాంతాలలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని మంత్రి ని కోరారు. సొసైటీ ప్రతినిధులు తీసుకువచ్చిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హామీ ఇచ్చారు. జీవో నెంబర్ 535లో ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లి జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉందని తన దృష్టికి వచ్చిందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ఈ విషయాలపై చర్చిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ గౌరవ అధ్యక్షులు జి .జనార్దన్ రావు, అధ్యక్షుడు బి. రవికాంత్, ఉపాధ్యక్షులు ఉమామహేశ్వర రావు,సహాయ కార్యదర్శి ఎం.చిట్టిబాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి బొప్పన రమేష్ తదితరులు పాల్గొన్నారు.